
శ్రీ సత్యసాయి జిల్లా, 19 నవంబర్ (హి.స.)
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎంపీపీ పదవుల పంపకం అధికార కూటమిలో రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ వైఖరిపై స్థానిక టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, ధర్మవరం మండలాల ఎంపీపీ పదవులను బీజేపీ ఆశిస్తుండటంతో వివాదం మొదలైంది.
ఈ నాలుగు మండలాల్లో ఎంపీపీ పదవులను తమ పార్టీకి కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఆయా మండలాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఎంపీటీసీ బలం లేకపోవడం టీడీపీ నాయకుల అభ్యంతరాలకు కారణమవుతోంది. ముఖ్యంగా తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లో బీజేపీ కేవలం ఒక్కో ఎంపీటీసీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
ఒక్క ఎంపీటీసీ సభ్యుడి బలం ఉన్న పార్టీకి ఎంపీపీ పదవులు ఎలా కేటాయిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా బలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పదవుల పంపకాలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్