రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. మహేశ్కుమార్ గౌడ్
తెలంగాణ ప్రయోజనాలు, ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ
Tpcc


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)

తెలంగాణ ప్రయోజనాలు, ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.

గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పాలన, కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా విమర్శలు చేశారు.

నీటి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త డ్రామా అని మండిపడ్డారు.

నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ నీటిని తరలించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని, తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుమార్లు స్పష్టమైన వైఖరిని ప్రకటించారని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పిందని ఆరోపిస్తూ ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు, బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ తెలంగాణ అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాసిందని, రాష్ట్ర అభ్యంతరాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద కేంద్ర బలగాల భద్రత, కేఆర్ఎంబీ నియంత్రణ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande