
హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు లేని మహానగరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని, ప్రతిరోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చెత్త నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు తాగునీటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీ) శుద్ధి చేసిన నీటిని ఈ పనులకు ఉపయోగించేలా గ్రీన్ ట్యాంకర్లపై ప్రజలకు, సంబంధిత వర్గాలకు అవగాహన కల్పించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు