
నిజామాబాద్, 02 నవంబర్ (హి.స.)
విద్యార్థుల జీవితంలో విద్య ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యం, మానసిక వికాసానికి క్రీడలు కూడా అంతే అవసరమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించిన 70వ అండర్-14, అండర్-17 బాలబాలికల మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే పిల్లలు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు.
నియోజకవర్గంలో క్రీడా వాతావరణాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో వివిధ స్థాయిల్లో క్రీడా పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.ఆటల్లో గెలుపోటములు సహజమని, పోటీల్లో ఓడిపోయిన క్రీడాకారులు నిరాశ చెందకుండా గెలుపొందేందుకు పట్టుదల పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా స్థానిక పాఠశాలల క్రీడా మైదానాలకు పంపించాలని, వారికి నచ్చిన ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..