
అమరావతి , 02 నవంబర్ (హి.స.)
మురసు తుపాను ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నడిచే తొమ్మిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ రోజు, రేపు రాకపోకలు సాగించాల్సిన విజయవాడ–గూడూరు, గూడూరు–విజయవాడ రైళ్లతో పాటు గుంటూరు–తెనాలి, తెనాలి–గుంటూరు రైళ్లను కూడా నిలిపివేశారు. అదేవిధంగా ఈ రోజు ప్రయాణించాల్సిన తెనాలి–రేపల్లె రైలును రద్దు చేశారు. రేపు నడవాల్సిన రేపల్లె–మార్కాపురం రోడ్డు, మార్కాపురం రోడ్డు–రేపల్లె రైళ్ల సర్వీసులు కూడా అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
తుపాను ప్రభావంతో రైల్వే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక రైల్వే ప్రకటనలను పరిశీలించాలని కోరారు. ప్రయాణికులు రైల్వే శాఖ సూచనలను పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్