
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఖానాపూర్తో పాటు జగిత్యాలలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ధాన్యం సేకరణకు సంబంధించిన లావాదేవీలు, కొనుగోళ్ల రికార్డులు, ఇతర వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే సోదాలకు సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
రేఖా నాయక్ 2014 నుంచి పదేళ్లపాటు ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం ఆయన కూడా కాంగ్రెస్లో చేరి 2023 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
తాజాగా రేఖా నాయక్ నివాసంలో ఈడీ తనిఖీలు జరగడం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ఏయే అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్