
నిర్మల్ జిల్లా, 20 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. గతంలో ఖానాపూర్, జగిత్యాల ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదును సంబంధిత వ్యక్తులు తిరిగి చెల్లించలేదనే అంశం కూడా ఈడీ విచారణకు కారణమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధికారులు రేఖానాయక్ నివాసానికి చేరుకుని పలు అంశాలపై తనిఖీలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర కీలక వివరాలపై పరిశీలన జరిపినట్లు సమాచారం. కొంతసేపు కొనసాగిన ఈ సోదాలు తాజాగా పూర్తయ్యాయి.
అయితే తనిఖీల్లో ఏయే అంశాలను గుర్తించారు? ఏమైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అనే వివరాలను ఈడీ అధికారులు వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో రేఖానాయక్ ఇంట్లో జరిగిన ఈడీ సోదాలు రాజకీయ, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్