
మేడ్చల్ జిల్లా, 20 నవంబర్ (హి.స.)మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వార్డు ఆఫీసర్ రవీంద్ర రూ.30 వేల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి సంబంధించిన అసెస్మెంట్ పనిని పూర్తి చేసేందుకు రవీంద్ర డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
తన పని పూర్తి కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని అధికారి ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ బృందం మున్సిపల్ కార్యాలయంలో నిఘా పెట్టింది. ఈ క్రమంలో రవీంద్ర బాధితుడి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలను లంచాల పేరుతో వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్