
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు హిత చింతక్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆమె చెప్పారు.
1964లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆవిర్భవించిన విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజ ఐక్యత, ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, దేవాలయాల రక్షణ, అంటరానితనం నిర్మూలన, సామాజిక సమరసతతో పాటు విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు.15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కేవలం రూ.20 సభ్యత్వ రుసుముతో హిత చింతకులుగా చేరవచ్చని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ ఐక్యత, సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అభియాన్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కోటి మందిని, తెలంగాణలో 5 లక్షల హిందువులను హిత చింతక్ అభియాన్ లో చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రచార ప్రసార ప్రముఖ్ రేగు అనిల్ కుమార్, సోషల్ మీడియా ప్రముఖ్ దీరజ్, రవి కాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్