
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త కార్యదర్శులను ఖరారు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శులుగా సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లకు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు సెంథమిల్ అరసు, వి. శంకర్‌ను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించింది. ఈ నియామకాల ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులకు, అధిష్ఠానానికి మధ్య సమన్వయం పెంచడం, ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం వంటి బాధ్యతలను కొత్త కార్యదర్శులు నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
కొత్తగా నియమితులైన కార్యదర్శులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మరింత ఊపునివ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్