ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
Insurance


హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఒక్కో కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా కుటుంబం ప్రకటించిన సంపాదించే వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు. నమోదు చేసుకునే సమయానికి లబ్ధిదారుడి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు అర్హులుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, వారు ముందుగా ఎంపిక చేసుకున్న నామినీలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర ప్రభుత్వ బీమా పథకాలను కొనసాగిస్తూనే, వాటన్నింటినీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అర్హులైన కుటుంబాలను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande