
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ పరిధిలోని ఆదిభట్లలో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఓ అయ్యప్ప భక్తుడిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఏసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఏసీపీ ప్రదీప్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
అయ్యప్ప భక్తుడిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పలువురు భక్తులు ఏసీపీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఏసీపీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశాయి. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తుల పట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పట్టుబట్టారు. దీంతో ఏసీపీ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్