
అమరావతి , 20 నవంబర్ (హి.స.)
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు శుక్రవారం (నవంబర్ 20) నుంచి ప్రారంభమయ్యాయి. అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో దీక్షలు స్వీకరించేందుకు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
దీక్షలో భాగంగా అర్చక స్వాములు భక్తులకు సంప్రదాయబద్ధంగా మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో మండల దీక్ష చేపట్టే భవానీలు నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, మాలధారణ తదితర కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
దేవస్థానం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు మండల దీక్షలు కొనసాగనున్నాయి. అనంతరం డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు అర్ధమండల దీక్షలు నిర్వహించనున్నారు. దీక్షలు స్వీకరించిన భక్తుల విరమణ కార్యక్రమం డిసెంబర్ 30 నుంచి జనవరి 3వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్