
అనంతపురం , 20 నవంబర్ (హి.స.)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం నుంచి వైసీపీ వర్గీయులు, మరోవైపు జూనియర్ కళాశాల మైదానం నుంచి టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగినట్లు సమాచారం.
ఈ ఘటనతో తాడిపత్రిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా ఉండటంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘర్షణ నేపథ్యంలో ప్రాంతంలో భద్రతను పర్యవేక్షించారు. రాజకీయ విభేదాల కారణంగా మరోసారి తాడిపత్రిలో ఉద్రిక్తతలు తలెత్తడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇరు వర్గాల మధ్య పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్