
విశాఖపట్నం , 20 నవంబర్ (హి.స.)
విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాలనాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముత్యాలనాయుడు మరణవార్త తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే మేయర్ ముక్కా శ్రావణికి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కార్పొరేటర్‌గా ముత్యాలనాయుడు విశాఖపట్నం ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో శ్రావణి, ఆమె కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ముత్యాలనాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
మంత్రి నారా లోకేశ్ సైతం ముత్యాలనాయుడు మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముత్యాలనాయుడు మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పలువురు నేతలు భరోసా ఇస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్