మైనింగ్ రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల వినియోగం, మైనింగ్ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Chandrababu Naidu


అమరావతి , 20 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల వినియోగం, మైనింగ్ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

ఏపీఎండీసీ పరిధిలోని ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. సంస్థను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఐపీఓకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా అంచనా వేశారు. భవిష్యత్తులో కీలకంగా మారనున్న లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల అన్వేషణ, అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.

అలాగే రేర్ ఎర్త్ ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కృత్రిమ మేధస్సు సాయంతో రాష్ట్రంలో 582 ఖనిజ అన్వేషణ ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల వేలంలోనూ ఏపీఎండీసీ పాల్గొననుంది. క్వారీ లీజుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇప్పటికే రూ.400 కోట్ల ఆదాయం సమకూరిందని చంద్రబాబు తెలిపారు. మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande