
శ్రీకాకుళం, 20 నవంబర్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని అక్వాన్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కలవరపెడుతోంది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రవాహం 40 వేల క్యూసెక్కులకు చేరడంతో పరిసర ప్రాంతాల్లో నీటిమట్టం భారీగా పెరిగింది.
దీంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇచ్ఛాపురం పట్టణానికి వెళ్లే బెల్లుపడ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉద్దానం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్