సారవ్వ మృతిపై మంత్రి సీతక్క సంతాపం.. రూ.10 లక్షల బీమా అందించాలని ఆదేశం
స్వయం సహాయక సంఘం సభ్యురాలు సారవ్వ మృతి పట్ల తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Seethaka


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

స్వయం సహాయక సంఘం సభ్యురాలు సారవ్వ మృతి పట్ల తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సారవ్వ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నందున ఆమెకు రావాల్సిన రూ.10 లక్షల ప్రమాద బీమా పరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభకు సారవ్వ హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ బస్సులో నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సారవ్వ మరణవార్త తెలుసుకున్న మంత్రి సీతక్క స్పందిస్తూ, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రమాద బీమా ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో మహిళా సంఘం సభ్యురాలు మృతి చెందడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande