
పెద్దపల్లి, 20 నవంబర్ (హి.స.)
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చెప్పారు.
శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ బీమా పథకం ఆన్ లైన్ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పథకానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన విజయరమణారావు, దేశంలో మరెక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో ప్రజలకు మెరుగైన సంక్షేమ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ బీమా పథకాన్ని సిద్ధిపేటలో ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందని, కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా సాయం అందుతుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం ఇచ్చి అమలు చేయని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. గత పదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు