
రాజన్న సిరిసిల్ల, 20 నవంబర్ (హి.స.)
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సంపాదనపరుడిని కోల్పోతే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ముఖ్య ఉద్దేశమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్, రాష్ట్రంలోని కోటి ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. భూములు, ఆస్తులు లేని నిరుపేద కుటుంబాలకు కూడా జీవిత బీమా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని, కుటుంబంలో ఎవరిని ప్రధాన సభ్యుడిగా ఎంపిక చేసుకోవాలనేది ఆ కుటుంబమే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు