
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం అందింది. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయనుంది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా హాల్టికెట్లను పొందవచ్చు. నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 275 సివిల్ ఎస్ఐ, సమాన స్థాయి పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరగనుంది.
పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 335 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్