
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో అవకాశం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఆయుష్ శాఖలో ఖాళీగా ఉన్న 70 పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కలగనుంది.
నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లికేషన్లు పూర్తి చేసుకోవడం మంచిదని భావిస్తున్నారు.
ఈ నియామక ప్రక్రియను MHSRB పర్యవేక్షించనుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. ఆయుష్ విభాగంలో ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో 70 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఉద్యోగార్థుల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్