
ఎన్టీఆర్ జిల్లా, 20 నవంబర్ (హి.స.)
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా ప్రయాణించిన పెద్దపులి తాజాగా చీమలపాడు సిలువగట్టు ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులను బయట వదలకుండా సురక్షిత ప్రదేశాల్లో కట్టివేయాలని అధికారులు హెచ్చరించారు. పొలాలు, అటవీ ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పెద్దపులి ఎక్కడైనా కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం చేయకూడదని స్పష్టం చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పులి కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్