
కాకినాడ, 20 నవంబర్ (హి.స.)
కాకినాడ జిల్లా పిఠాపురంలో నేడు అపోలో ఆసుపత్రుల గ్రూప్ వైస్‌ఛైర్మన్, అపోలో ఫౌండేషన్ ప్రతినిధి ఉపాసన పర్యటించనున్నారు. పిఠాపురం అగ్రహారంలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరుకానున్నారు. ఇద్దరూ కలిసి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు చేపట్టి ఆధునిక సదుపాయాలతో కేంద్రాన్ని తీర్చిదిద్దారు. అంగన్వాడీ చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించడంతో పాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 109 అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని అపోలో ఫౌండేషన్ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని పిఠాపురం నియోజకవర్గంలో నిర్మించడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గం సుగమం కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్