ఏపీ పెట్టుబడుల వ్యూహంపై లోకేష్ ఆసక్తికర ట్వీట్.. ప్రత్యర్థులకు చురకలు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు.
Lokesh


అమరావతి , 21 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. తమిళనాడుకు సంబంధించిన పెట్టుబడుల వ్యూహం లీకైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా చమత్కారమైన ట్వీట్ చేశారు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తనదైన శైలిలో వివరించారు.

పెట్టుబడుల కోసం ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రభుత్వం వెంటనే స్పందించి, అదే రోజు సమాధానం ఇవ్వడమే ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న అసలైన రహస్య వ్యూహమని లోకేష్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, వారి ప్రతిపాదనలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

తమిళనాడు పెట్టుబడుల వ్యూహం లీకైందనే ప్రచారంపై స్పందిస్తూ.. తమ రహస్య వ్యూహం కూడా బయటపడిందని, కావాలంటే ఇతర రాష్ట్రాలు దానిని కాపీ చేసుకోవచ్చంటూ లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెట్టుబడుల విషయంలో వేగవంతమైన స్పందన, పారదర్శకతే ఏపీ ప్రభుత్వ ప్రత్యేకతగా మంత్రి చెప్పకనే చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande