ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో పెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Accident


ప్రకాశం , 21 నవంబర్ (హి.స.)

ప్రకాశం జిల్లాలో పెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లూరు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బాపట్లకు నూతన వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను కారు డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి, అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఇంట్లో జరగాల్సిన సంబరాలు ఈ ఘటనతో విషాదంగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande