
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చకు దారితీశారు. చేతిలో గన్ పట్టుకుని ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి హిందూ కుటుంబం ఆత్మరక్షణ కోసం ఇంట్లో లైసెన్స్డ్ తుపాకీ కలిగి ఉండాలని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.
దేశంలో ‘హమ్ దో.. హమారే దో’ చట్టాన్ని అమలు చేయాలని కూడా రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆ చట్టాన్ని తీసుకురాకపోతే ప్రతి హిందూ ఇంట్లో లైసెన్స్డ్ గన్ ఉండటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. హిందువుల ఆస్తులు, మహిళల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా మార్పుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం జనాభా పెరుగుదలపై కొన్ని నివేదికలను ఉటంకించారు. అయితే ఆయన ప్రస్తావించిన జనాభా అంచనాలు, వాటి ఆధారాలపై స్వతంత్ర ధృవీకరణ అవసరం.
భారత్‌లో కూడా పాకిస్థాన్ తరహా పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటూ రాజాసింగ్ తన వీడియోలో వ్యాఖ్యానించారు. మత మార్పిడులు, హత్యలు, మహిళలపై దాడులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి మతపరమైన భద్రత, జనాభా గణాంకాలు, వ్యక్తిగత రక్షణ అంశాలు చర్చలోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లోని గన్ కల్చర్‌ను తాను ఇష్టపడతానని, అక్కడ ప్రతి ఇంట్లో లైసెన్స్డ్ తుపాకీ ఉంటుందని రాజాసింగ్ పేర్కొన్నారు. అదే విధానాన్ని దేశవ్యాప్తంగా హిందూ కుటుంబాలు అనుసరించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..