
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు.
రెండేళ్లు గడుస్తున్నా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖలకు ఇప్పటికీ పూర్తిస్థాయి కార్యదర్శులు లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. గతంలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 లక్షల సీసీ కెమెరాల్లో ప్రస్తుతం కేవలం 5 లక్షలు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందులు అందుబాటులో లేవని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య కూడా తగ్గుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమార్తె ప్రైవేటు పాఠశాలలు ఎందుకు ప్రారంభిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్