
కోరుట్ల, 21 నవంబర్ (హి.స.)
మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం రూ.77 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులను శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాలలో ఇంకా ఏవైనా సమస్యలు, అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, చిన్నప్పటి నుంచే జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. లక్ష్య సాధనకు నిరంతర శ్రమ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యా అవకాశాలు, మెరుగైన వసతులు అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..