
అమరావతి , 21 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది సంఖ్య 3,141కు చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మేయర్, ఛైర్పర్సన్ పదవులను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
రెండో విడతలో భాగంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు మేయర్ స్థానాల కోసం మొత్తం 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తుది బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మేయర్, ఛైర్పర్సన్ పీఠాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్