
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో చలి ప్రభావం కూడా కొనసాగుతుండటంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అకాల వర్షాల వల్ల రైతులు, ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంట ఉత్పత్తులు, ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్