
తిరుమల , 21 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర నరసింహస్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. స్వామివారి వాహన సేవను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి.
కైశిక ద్వాదశి సందర్భంగా నిర్వహించే ఈ వాహన ఊరేగింపుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సూర్యోదయానికి ముందే స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ తిరువీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారుజామున నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలలో ఈ పర్వదినం భక్తులకు భక్తిపారవశ్యాన్ని పంచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్