అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి.. ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు.
Sp


వికారాబాద్, 21 నవంబర్ (హి.స.)

వికారాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపట్టారు.

శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనదారుల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు.

ఈ తనిఖీల్లో మొత్తం 1,287 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 610 ద్విచక్ర వాహనాలు, 218 త్రిచక్ర వాహనాలు, 296 నాలుగు చక్రాల వాహనాలు, 163 భారీ వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 120 ఈ-పెట్టీ కేసులు, 83 డీడీ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 272 ఈ-చలాన్లు జారీ చేసి మొత్తం రూ.98,730 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. నాకాబందీ వంటి ప్రత్యేక తనిఖీల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande