
అమరావతి , 21 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం సాధ్యం కాదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టమని తాము ముందుగానే చెప్పామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ పనితీరును సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు.
గతంలో తనపై జరిగిన చర్యలను ప్రస్తావిస్తూ.. తనను 18 రోజుల పాటు జైలులో ఉంచారని తెలిపారు. అంతేకాకుండా తన నివాసంపై సుమారు 7 గంటల 20 నిమిషాల పాటు దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యవహారశైలిపై ప్రజలు గమనించి తగిన నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్