
శ్రీశైలం:, 21 నవంబర్ (హి.స.)
కార్తీక మాసోత్సవాలు, ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన లక్షలాది దీపాల కాంతులతో శ్రీగిరి క్షేత్రం ఇలకైలాసాన్ని తలపించింది. ఆగమ పాఠశాల, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎదురుగా ఉన్న విశాలమైన మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఇలకైలాసం' వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య షోడశోపచార పూజలు, దశవిధ హారతులు సమర్పించారు.
ఈ వేడుకలో భాగంగా సాయంత్రం నుంచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు నాగూర్ బాబు (మనో) బృందం ఆలపించిన భక్తి గీతాల స్వరార్చన క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీపాలు వెలిగించేందుకు వీలుగా ప్రమిదలు, నూనె, ఒత్తులను దేవస్థానమే ఉచితంగా అందజేసింది. ఈవో ఎం. శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు, ఇతర అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi