
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పాల్వంచలో నిర్వహించనున్న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరుపతి నుంచి బయలుదేరనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు.
ఆలయంలో నిర్వహించనున్న సుదర్శన హోమంలో చంద్రబాబు తన సతీమణితో కలిసి పాల్గొంటారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమం జరగనుంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రత, రవాణా, ఇతర సౌకర్యాలకు సంబంధించి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తెలంగాణ జిల్లాలో పర్యటించనుండటంతో రాజకీయ, అధికార వర్గాల్లోనూ ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనుండటం ఈ పర్యటనలో ప్రధాన అంశంగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్