
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆదర్శమూర్తిగా జీవించి సమాజానికి విలువైన మార్గదర్శకత్వం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన చూపిన సన్మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నమ్మకం, ధైర్యం వంటి గొప్ప లక్షణాలను పెంపొందించడంలో సంత్ సేవాలాల్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో లంబాడా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వేర్వేరు పేర్లతో గుర్తింపు పొందుతున్నారని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ సమాజానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని వివరించారు. గతంలో లంబాడాలు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు సాగించి తమ ధైర్యసాహసాలను చాటుకున్నారని గుర్తుచేశారు.
లంబాడా సమాజం నమ్మకానికి, విశ్వాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఒకరిని నమ్మితే వారి కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు వెనుకాడని గొప్ప మనస్తత్వం ఆ జాతి సొంతమని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు ఆయన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆయన జీవిత చరిత్ర సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్