
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగు, అచ్చంపేట పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
మద్దిమడుగులో జరిగే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేవంత్రెడ్డి హెలికాప్టర్లో అచ్చంపేట పట్టణానికి చేరుకోనున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన వసతుల కల్పనకు సంబంధించిన పనులకు ఈ పర్యటనలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పర్యటన జరిగే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లతో పాటు సభా ప్రాంగణాలు, హెలిప్యాడ్, ఇతర సౌకర్యాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అచ్చంపేట ప్రాంతంలో సీఎం పర్యటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్