
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నేడు భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఈ మార్చ్ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు సందీప్‌కుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పీసీసీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం శ్రేణులకు పిలుపునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్