
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) సత్యనారాయణను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే ఆయనను ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకోనున్నారు.
ప్రస్తుతం సత్యనారాయణ చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టడీలో భాగంగా ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు, ఆదాయ వనరులు, సంపాదించిన ఆస్తుల వెనుక ఉన్న లావాదేవీలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ కేసును నమోదు చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి పలు వివరాలను సేకరించిన అధికారులు, కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలను రాబట్టాలని భావిస్తున్నారు. సత్యనారాయణ ఇచ్చే సమాధానాలు, విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్