
మహబూబాబాద్, 26 నవంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా గిరిజన గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించే వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.
నాగపూర్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ నిర్మాణంలో భాగంగా తండాలో సుమారు 30కి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ తమకు నివాసం ఉండేందుకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.
బాధితుల వినతిపై స్పందించిన రెవెన్యూ అధికారులు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 408 లో ఉన్న సుమారు రెండు ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే మంగ్య అనే రైతు తన పేరుపై అసైన్డ్ పట్టా ఉందని, ఇందులో ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారంటూ పట్టాదారుడు ఎమ్మార్వో రాఘవరెడ్డి ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
పరిస్థితి చేయి దాటకుండా ఎమ్మార్వో రాఘవరెడ్డి పట్టాదారుడితో పాటు స్థానిక గిరిజనులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు భారీ ఎత్తున తండాలో మోహరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..