
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘హైదరాబాద్ వాక్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు రెండో రోజు ముషీరాబాద్ వేదికైంది.
ముషీరాబాద్ నుంచి కిషన్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా సత్యం థియేటర్ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొంటున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తున్నారు.
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ సమస్యను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ నిర్మాణమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్