
హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)
రాజ్యాంగం నిర్దేశించిన విలువలను జీవితంలో ఆచరిస్తూ వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ సభ సభ్యుల దార్శనికత, అంకితభావం, చేసిన కృషి భారత ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆదర్శాలే దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి మార్గదర్శకాలని ఆయన వివరించారు. రాజ్యాంగం పౌరులకు హక్కులు కల్పించడమే కాకుండా దేశం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత రాజ్యాంగ స్ఫూర్తిని లోతుగా అర్థం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి పౌరుడు తన ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ చేతులు కలపాలని గవర్నర్ ఆకాంక్షించారు. సమిష్టి కృషితోనే సమ్మిళిత, సుసంపన్న భారతదేశాన్ని నిర్మించి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..