యువతకు ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ దగా.. రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు
యువతకు ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ దగా.. రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు
యువతకు ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ దగా.. రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

ఎన్నికల వేళ తెలంగాణ నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశోక్ నగర్ వీధుల్లో నిరుద్యోగులతో కలిసి ఛాయ్ తాగుతూ, ఎన్నో ఆశలు రేకెత్తించిన రాహుల్ గాంధీ నేడు రాష్ట్ర యువత గోడును ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. గురువారం 'ఎక్స్' వేదికగా స్పందించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

కేవలం కెమెరాల ముందు ఫోటోలకు ఫోజులిస్తూ, ఛాయ్ తాగినంత మాత్రాన ఉద్యోగాలు సృష్టించలేరని కేటీఆర్ చురకలంటించారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలంటే పాలకులకు ముందుచూపు, నిజాయితీ, కఠోర శ్రమ ఉండాలని హితవు పలికారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా అని ప్రశ్నించారు.

నేడు రాష్ట్రంలో తమ హక్కుల కోసం రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పాలనపై రాహుల్ గాంధీ మౌనం వీడాలని, తెలంగాణ యువతకు చేసిన మోసానికి బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande