
బాపట్ల జిల్లా , 03 నవంబర్
(హి.స.)
తీవ్ర తుఫాను ‘మురసు’ ధాటికి బాపట్ల
జిల్లా వణికిపోతోంది.రాబోయే మూడు గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన
అపార వర్షపాతం నమోదుకానుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు.గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసర
పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.చెట్లు, విద్యుత్ స్తంభాలు,
ప్రకటన బోర్డులు (హోర్డింగులు) ఉన్న
ప్రాంగణాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరమని,
రైతులు మరియు మత్స్యకారులు తగిన
జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
తుఫాను తీవ్రత కారణంగా సముద్రం తీవ్రంగా
అల్లకల్లోలంగా మారింది.గత వారం వాడరేవు తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన ఐదుగురు
మత్స్యకారులు ఇప్పటివరకు ఒడ్డుకు తిరిగి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.సముద్రంలో తుఫాను గాలుల ప్రభావం పెరగడంతో వారి ఆచూకీ లభ్యం కాక
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.కోస్ట్ గార్డ్ మరియు మెరైన్ పోలీసుల
ద్వారా గాలింపు చర్యలను చేపడుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన తుఫాను వర్షం వల్ల
బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాధారణ జీవనం స్తంభించిపోయింది.వీధుల వెంబడి ఉన్న భారీ వృక్షాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా
మరియు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి.ముఖ్యంగా సూర్యలంకకు
వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో రవాణా నిలిచిపోయింది.తోడై కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు
నీటమునిగాయి; వాగులు, వంకలు ఉప్పొంగి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
తుఫాను ముప్పు, ఈదురుగాలుల ధాటికి
రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.బాపట్ల రైల్వే
స్టేషన్‌లో జైపూర్ - చెన్నై మరియు విశాఖపట్నం - చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను
అధికారులు నిలిపివేశారు.పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రయాణికులు సురక్షితంగా
ఉండాలని అధికారులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi