
అమరావతి , 08 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆరు అవార్డులు రావడం గర్వకారణమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర పురపాలక శాఖకు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పట్టణాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
పట్టణాల్లో చెత్త పేరుకుపోకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి నెలా మూడవ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వ్యర్థ రహిత పట్టణాల నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులు లేని ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
ఈ విజయానికి కృషి చేసిన పురపాలక శాఖ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, క్షేత్రస్థాయి ఉద్యోగులకు మంత్రి నారాయణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి సమష్టి కృషి వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు లభించిందని ప్రశంసించారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేయనుందని వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు సాధించేలా పనిచేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్