
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొని స్వామివారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 36 సంవత్సరాలుగా తాము చిన్నజీయర్ స్వామివారి భక్తులుగా కొనసాగుతున్నామని తెలిపారు. స్వామివారు సమాజానికి అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
విద్య, వైద్యం, మహిళా సంక్షేమం వంటి కీలక రంగాల్లో జీయర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు చిన్నజీయర్ స్వామి చేస్తున్న కృషి అమూల్యమని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణలో ఆయన పాత్ర ప్రశంసనీయమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్