
హైదరాబాద్, 08 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించిన పని దాదాపు ముగిసే దశకు వచ్చింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో జూన్ 2 నుంచి అక్టోబర్ 7 మధ్య అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను అధికారులు దాదాపుగా తేల్చేశారు.
నవంబర్ 6 అర్ధరాత్రి లెక్కల ప్రకారం.. మొత్తం వచ్చిన 3,96,756 వినతుల్లో 3,96,435 వరకు పరిష్కారం అయ్యాయి. అంటే 99.92 శాతం పని పూర్తయినట్టే. ఇంకా చేతిలో మిగిలింది కేవలం 321 దరఖాస్తులు మాత్రమే.
తేలిన దరఖాస్తుల్లో 3,33,560 మందికి ఓకే చెప్పగా, 62,875 దరఖాస్తులను పక్కన పెట్టేశారు.
కొత్త ఓటర్లు - ఫారం 6: 2,18,005 దరఖాస్తులు రాగా 2,17,965 తేల్చారు. 1,86,579 మందికి ఓటరుగా అవకాశం దక్కగా, 31,386 దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. ఇంకా 40 పెండింగ్లో ఉన్నాయి.
విదేశాల్లోని ఓటర్లు - ఫారం 6ఏ: 4,591 దరఖాస్తుల్లో 4,555 పరిష్కరించారు. 2,310 ఆమోదం పొందగా, 2,245 తిరస్కరణకు గురయ్యాయి. 36 ఇంకా చూడాల్సి ఉంది.
పేర్ల తొలగింపు - ఫారం 7: 11,505 దరఖాస్తుల్లో 11,277 పూర్తి చేశారు. 8,323 కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, 2,954 ను తిరస్కరించారు. 228 పెండింగ్లో ఉన్నాయి.
వివరాల మార్పులు - ఫారం 8: ఇందులోనే అత్యధికంగా 1,62,655 దరఖాస్తులు వచ్చాయి. 1,62,638 పరిష్కరించారు. 1,36,348 ఆమోదం పొందగా, 26,290 రిజెక్ట్ అయ్యాయి. కేవలం 17 మాత్రమే మిగిలాయి. ఈ విభాగంలో పరిష్కార రేటు 99.99 శాతం.
మొత్తం దరఖాస్తుల్లో ఆన్లైన్లో వచ్చినవే ఎక్కువ. 3,75,109 మంది ఆన్లైన్లో అప్లై చేయగా, 21,647 మంది ఆఫ్లైన్లో ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు