
జగిత్యాల, 08 నవంబర్ (హి.స.)
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో మంత్రి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత బెడ్డల నాగమణి-బానేష్, తమ్మడపైన సరిత-రాజలింగం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల వద్ద జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. సీఎం పుట్టినరోజు, దీపావళి ఒకే రోజు రావడం ఆనందంగా ఉందన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 2,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2 వేల ఇళ్లు కడతామని తెలిపారు. పేదల సొంతింటి కల కోసం నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు రూ.275 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు