
భద్రాద్రి కొత్తగూడెం, 08 నవంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో, పాల్వంచ డీఎస్పీ సూచన మేరకు దమ్మపేట మండలం అంకంపాలెం లంకలపల్లి గ్రామంలో అశ్వారావుపేట సీఐ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడం, ప్రజల్లో భద్రతపై నమ్మకం కలిగించడమే ఈ తనిఖీల ఉద్దేశమని సీఐ చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలోని 54 ఇళ్లను పరిశీలించారు. పత్రాలు సరిగా లేని 28 బైకులతో పాటు ఒక ఆటో, ఒక ట్రాక్టర్, ఒక బొలెరో వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. వాటిలో పత్రాలు లేని నాలుగు బైకులకు జరిమానా వేశారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ..
గంజాయి, మత్తు పదార్థాలు వాడటం, వాటిని అక్రమంగా తరలించడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అలాంటి విషయాలు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, తాగి బండి నడపవద్దని సూచించారు. పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, ఫోన్ కాల్స్ నమ్మి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ ఇవ్వవద్దని అవగాహన కల్పించారు. శాంతిభద్రతల కోసం ఇలాంటి తనిఖీలు ఇకపై కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..